వారి రోదన "ఎక్స్ ప్రెస్"చేయలేక సోషల్ మీడియాకెక్కుతున్నారా !

ఉద్యోగుల జీవితాల‌తో ఆట‌లు కొన‌సాగిస్తూనే వుంది “ఎక్స్‌ప్రెస్” యాజ‌మాన్యం. గ‌త కొద్ది రోజులుగా జీతాల కోసం ఆందోళ‌న‌కు దిగిన ఉద్యోగులు..స‌హాయ‌నిరాక‌ర‌ణ‌కు దిగారు. శాంతియుతంగా ఉద్య‌మిస్తున్నారు. నాలుగు నెల‌లుగా జీతాలు ఇవ్వ‌క‌పోయినా ప‌నిచేస్తున్న ఎంప్లాయీస్‌, జ‌ర్న‌లిస్టుల స‌హ‌నాన్ని చేత‌కానిత‌నంగా తీసుకున్న మేనేజ్‌మెంట్ కొత్త డ్రామాల‌కు తెర‌తీసింది. రేపు మాపు జీతాలిస్తామంటూ న‌మ్మ‌బ‌లికింది. ఇవేవీ జ‌రిగేవి కావ‌ని తేల‌డంతో ఉద్యోగులు కార్యాల‌యం ఎదుటే బైఠాయించారు. టీయూడ‌బ్ల్యుజే నేత‌లు ఉద్యోగులకు సంపూర్ణ సంఘీభావం ప్ర‌క‌టించారు.

తెలంగాణ యూనియ‌న్ ఆఫ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ నేత‌లతో యాజ‌మాన్యం ప్ర‌తినిధులు చ‌ర్చ‌లు జ‌రిపారు. జీతాలు ఇచ్చేస్తామ‌ని నేత‌ల ఎదుట హామీ ఇచ్చిన యాజ‌మాన్యం మాట త‌ప్పింది. దీంతో త‌దుప‌రి ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని జ‌ర్న‌లిస్ట్ నేత‌లు చెప్పారు. వంద‌ల మంది ఉద్యోగులు రోడ్డున‌ప‌డి.. మండుటెండ‌లో ..ఆక‌లి క‌డుపుల‌తో ఆందోళ‌న‌లో వున్నా.. ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత ప‌త్తాలేకుండా పోయారు. అయన అనుచ‌రుడు రాజుతో యూనియ‌న్ లీడ‌ర్ చ‌ర్చ‌లు జ‌రిపినా ఎటువంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. జ‌య‌రాంకు చెందిన మ‌రో కంపెనీ హేమ‌ర‌స్ కూడా న‌ష్టాల్లో వుంద‌ని స‌మాచారం. అక్క‌డి ఉద్యోగుల‌కు జీతాలు బ‌కాయిలున్నాయ‌ని తెలుస్తోంది. యూనియ‌న్ నేత‌ల ఆధ్వ‌ర్యంలో ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి , ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లాల‌ని ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు నిర్ణ‌యించారట .

ఉద్యోగుల‌కు క‌నీసం జీతాలు కూడా ఇవ్వ‌లేని వ్య‌క్తి.. ఒక మీడియా సంస్థ‌ను ప్రారంభించ‌డం ఏంట‌నేది జ‌వాబు దొర‌క‌ని ప్ర‌శ్న‌. అక్ర‌మ‌వ్యాపారాల‌ను కాపాడుకోవ‌డం, మీడియా ముసుగులో దోచుకోవాల‌నే క‌క్కుర్తితో క‌నీసం ప్లానింగ్ లేకుండా చాన‌ళ్లు పెట్టేయ‌డం, కొనేయ‌డం..ఆ త‌రువాత అందిన‌కాడికి దండుకుని, దోచుకుని ఉద్యోగుల‌ను న‌ట్టేట ముంచేయ‌డం ఈ మ‌ధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పరిపాటిగా మారింది చెప్పాలి మీడియా వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాలు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగి రాసినది చెబుతూ సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న ఓ లేఖ‌ను ..ఇక్కడ పోస్టు చేస్తున్నాం.

యువత కోసం భవిత కోసం అంటూ పుట్టుకొచ్చింది. బాధ్యతాయుత జర్నలిజాని మారుపేరుగా నిలుస్తామని ప్రకటించింది. కష్టం తెలుసు, శ్రమ విలువ తెలుసు అంటూ ప్రోమోలు దంచింది. ఎక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా… ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నించడమే మా బాధ్యత అని చెప్పుకుంది. కానీ.. యువత భవిష్యత్‌నే ప్రశ్నార్థకంలో పడేసింది ఎక్స్‌ప్రెస్ టీవీ. ఉద్యోగులను సొంత మనుషుల్లా.. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన సంస్థ.. వారిని కష్టాల కడలిలోకి నెట్టింది. సమయానికి జీతాలివ్వాలనే బాధ్యతను మర్చిపోయింది. వందల కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒకటి కాదు.. రెండు కాదు… ఏడాది కాలం నుంచి ఇదే పరిస్థితి. నెల మొదట్లో రావాల్సిన జీతం రాళ్ల కోసం.. ఇప్పుడా అప్పుడా అని ఎదురు చూసే దుస్థితి ఏర్పడింది సంస్థలో పని చేస్తున్న జర్నలిస్టులకు. ఒకటో తేదీని రావాల్సిన జీతం… వారానికో, పది రోజులకో లేక నెల చివర్లోనో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏడాది కాలం నుంచి ప్రతీ నెలా జీతం ఎప్పుడు జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు ఉద్యోగులకు. ఇప్పటికే ఐదు నెలల జీతాలు బకాయి ఉండడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితి ఏర్పడింది.

ఇస్త్రీ నలగని చొక్కాలు వేసినా… వాటి వెనక ఉన్న చిరుగుల బనీను ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తపడుతునే సమాజంలోని కుళ్లును కడిగేసే ప్రయత్నాలు చేశారు ఎక్స్‌ప్రెస్ టీవీ ఉద్యోగులు. ఇంట్లో వాళ్లకు బాగోలేకపోయినా… అద్దె కట్టలేక ఇంటి ఓనర్‌నుంచి చీత్కరింపులు ఎదురైనా .. పాలోడు పగోడిలా చూసినా.. పచారీ కొట్టోడు పరేషాన్ చేసినా… పంటి బిగువన మౌనంగానే భరించారు. కానీ.. వీరి ఇబ్బందులను యాజమాన్యం పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. తప్పని పరిస్థితుల్లో ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పెళ్లాం బిడ్డల ఆకలి తీర్చేందుకు, ఆసుపత్రి, ఇతర ఖర్చుల కోసం చేసిన అప్పులు గుదిబండలా మారుతుండడంతో… న్యాయంగా తమకు రావాల్సిన ఐదు నెలల వేతనాన్ని సాధించేందుకు పోరుబాట పట్టారు. వీరి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా.. తమదంతా ఒకే కుటుంబం అని నిరూపిస్తూ… ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. వీరి పోరాటానికి టీయూడబ్లుజే బాసటగా నిలుస్తోంది. వారి ఆకలి దప్పులు తీరుస్తూనే… జీతాల కోసం యాజమాన్యంతో అలుపెరుగని పోరాటం చేస్తోంది.

ఇది ఒక్క ఎక్స్‌ప్రెస్ టీవీలోనే ఉన్న పరిస్థితి కాదు.. మీడియా లో నెలకొన్న పరిస్థితి. రండి పోరాడుదాం. మన జీతాన్ని సాధించుకుందాం… మరో సంస్థ ఉద్యోగులు రోడ్డున పడకుండా కాపాడుదాం.. మిత్రులారా మీరెటు వైపు..? మాట్లాడాల్సిన సమయంలో మౌనం కూడా నేరమే.. దేశద్రోహమే కదా.. రండి.. రండి.. దగ్ధమైపోతున్న అక్షరాలను ఏరుకుని లేపనమద్ది, మళ్లీ నింగికెగిరేద్దాం.. రాజకీయుల నిబిడాశ్చర్యాన్ని మైమరచి చూద్దాం…

..ఇట్లు మీ ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగి⁠⁠⁠⁠]]>