భూమా మృతి పట్ల ప్రముఖులు,రాజకీయ నాయకుల సంతాపం

ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అంత్యక్రియలను సోమవారం ఆళ్లగడ్డలో నిర్వహిస్తామని ఆయన బావమరిది ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. నాగిరెడ్డి ఆకస్మిక మృతిపై పలువురు రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. భూమా మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… భూమా మృతి తీవ్ర ఆవేదన కల్గిస్తోందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా భూమాను కాపాడుకోలేకపోయామన్నారు. నిన్ననే భూమా నాగిరెడ్డి నన్ను కలిశారని, నాకు భూమా కుటుంబంతో ఎప్పటినుంచో అనుబంధం ఉందని చంద్రబాబు అన్నారు. అలాగే భూమా కూతురు అఖిలప్రియను, ఎస్వీ మోహన్‌రెడ్డిని ఫోన్‌లో చంద్రబాబు పరామర్శించారు.

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన భూమా కుటుంబానికి ఇది తీరని లోటని బాలకృష్ణ అన్నారు.

భూమా నాగిరెడ్డి మృతిపట్ల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా మృతి కర్నూలు జిల్లాకు తీరని లోటన్నారు. భూమా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. భూమా కుటుంబ సభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.

భూమానాగిరెడ్డి మృతికి కంభంపాటి రామ్మోహన్‌రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమానాగిరెడ్డి మృతి టీడీపీకి తీరని లోటని ఆయన అన్నారు. అలాంటి మంచి వ్యక్తిని కొల్పోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భూమా అఖిలప్రియను ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మీ ఫోన్‌లో పరామర్శించారు. అఖిలప్రియను జగన్, విజయలక్ష్మీ ఫోన్‌లో పరామర్శించారు. ఇటువంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలని అఖిలప్రియకు వారు ధైర్యం చెప్పారు.

నంద్యాల ఎమ్మెల్యే, టిడిపి నేత భూమా నాగిరెడ్డి మృతి పట్ల మంత్రి గంటా శ్రీనివాస‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి టిడీపీకి తీరని లోటని ఆయన అన్నారు. నిస్వార్థమైన వ్యక్తి అని ఆయన అన్నారు. పార్టీలో అత్యున్నతమైన వ్యక్తిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భూమా నాగిరెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం మంత్రి శిద్దా రాఘవరావు చేసారు. ఆయన మృతితో పార్టీ ఒక సమర్ధుడైన నాయకుడిని కోల్పోయిందని ఆయన అన్నారు. ఆయన అకాల మరణం పొందడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి అని ఆయన అన్నారు.

ఆళ్లగడ్డలోని స్వగృహంలో భూమా నాగిరెడ్డి భౌతికకాయానికి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నివాళులర్పించారు. భూమా నాగిరెడ్డి సమాజంలో చాలా ఉన్నతమైన వ్యక్తి అని అన్నారు. ఆయన ఇలా హఠాత్మరణం చెందడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణంతో కర్నూలు జిల్లా గొప్ప నాయకుడిని కోల్పోయిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. భూమా అకాల మృతిపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ… రాయలసీమలో టీడీపీ బలమైన నేతను కోల్పోయిందని, భూమా కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. అలాగే భూమా నాగిరెడ్డి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆమె అన్నారు.

]]>