పూర్వం తిరుమల ఎలా ఉండేదో తెలుసా…..

19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ… మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట.

వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్థోమత కూడా ఉండేది కాదు.

తిరుమల రాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు.

1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు

]]>