"పండుగ" ఉగాది ..పంచాంగం వెనుక మర్మం ఇదే

సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి. పండుగ, పర్వదినం అంటే ఒక సంతోషకరమైన రోజు, శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉంటాయి . ‘ పండుగ ‘ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే….. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ‘ పండుగ ‘ మానావాళికి హితాన్ని బోధిస్తుంది.

ugadi

హిందువులు జరుపుకునే పండుగలలో ఉగాది ఒకటి అన్ని పండగలలో ఉగాదికి గొప్ప ప్రాముఖ్యత ఉంది

ప్రతి రోజు చేసుకునే పనుల కోసం ఇప్పుడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన “గ్రిగేరియన్‌ క్యాలెండరు”ను ఉపయోగిస్తూ వున్నా…శుభకార్యాలు,పూజా పునస్కారాలు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి “పంచాంగము”ను వాడుతుంటారు. ఉగాది రోజు ముఖ్యం గా పంచాంగ శ్రవణo చేస్తారు.ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ‘పంచాంగ శ్రవణం’ ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.

ugadi2

ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం.పంచాంగం అంటే అయిదు అంగములు అని అర్ధం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు ఉన్నాయి. వీటన్నిటినీ తెలిపేదే “పంచాంగం”. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం.

ugaadi

ఉగాది పండుగ విశేషాలు 

 • ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ.
 • ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది.
 • ఈ రోజు ప్రతి ఊరిలో దేవాలయాలలో, కూడళ్ళలో, సాంసృతిక సంస్థలలో ఆ సంవత్సరం అంతటా జరిగే మార్పులు, వార ఫలితాలతో పంచాంగ శ్రవణం జరుగుతుంది.
 • ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం చేస్తారు.
 • ఈ పండుగను యుగాది (యుగ+ఆది) అని కూడా అంటారు.
 • తమిళులు మేష సంక్రాంతి మొదటి రోజు ఉగాది జరుపుకుంటారు.
 • కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు.
 • త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుకునేవారు.
 • ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు.
 • శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే.
 • వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే.
 • కొత్త లెక్కలు ఆరంభించే రోజు ఉగాది.
 • పంచంగ శ్రవణం చేసే రోజు ఉగాది.
 • ఉగాది రోజున కవులు కవితాగానం చెయ్యడం ఆనవాయితీ.
]]>