ఇది 'ఆనంద' చిమ్మిన విషం.. ఇప్పటికైనా 'మెగా ఆక్వా' ఆగేనా.. ?

తుందుర్రులో వస్తున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్‌‌ను స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచిస్తుందా.. ? మొగల్తూరులోని ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా విషవాయువు లీకై ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన తాజా ఘటన తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కూ సంబంధం ఉంది. ఇదే ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీనే మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా మొగల్తూరు ప్రాంతంలో అమ్మోనియం గ్యాస్ లీకవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్త చేసినా ఆనంద యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలితంగా ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయులు విపరీతగా లీకై ఐదుగురు నిరుపేద కార్మికుల్ని దిగమింగింది. మృతులు ఈగ ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, నల్లం ఏడుకొండలు, తోట శ్రీను, జక్కంశెట్టి ప్రవీణ్‌. చనిపోయిన వాళ్లంతా 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే. అంతా నిరుపేదలే. ఐదుగురు కార్మికులు చనిపోయారని తెలియగానే పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మెగా ఆక్వాఫుడ్ పార్క్ వస్తున్న తుందుర్రు ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

మెగా ఆక్వాఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న మల్లుల సురేష్ సహా వందలాది మంది రైతులు, మహిళలు, మత్స్యకారుల్ని ప్రభుత్వం అరెస్టు చేసింది. మల్లుల సురేష్‌ నేరుగా పవన్ కల్యాణ్‌ని కలిసి మెగా ఆక్వాఫుడ్ ఎంతటి ప్రమాదకరమో రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం చేశాక.. ఇంతకాలం ప్రధాన మీడియా ద్వారా మెగా ఆక్వాఫుడ్ పార్క్ చుట్టూ జరిగే ప్రజా నిరసనలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వచ్చిన మల్లుల సురేష్ ఇప్పుడు స్థానిక నాయకుల కుతంత్రాలతో కేసుల్లో ఇరుక్కొని  నరసాపురం సబ్-జైల్లో ఉన్నాడు . ఈ నేపథ్యంలోనే అదే ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మొగల్తూరులో నిర్వహిస్తున్నఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇంతటి ఘోరం జరిగింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా విచ్చల విడిగా విషవాయుల్ని ఉపయోగించడం, ఆ వ్యర్థాలను జీవనదిలోకి వదిలి వేయడం ఎప్పట్నుంచో జరుగుతోంది. ఈ ఘటనతో ప్రకృతికీ, గోదావరి నదికీ, ఆ ప్రాంత పొలాలకు మాత్రమే కాదు.. ఫుడ్ ప్రాసెసింగ్‌లో వాడే అమ్మోనియం వాయువు మనుషుల ప్రాణాలకు ఎంతటి ప్రమాదకరమో మరోసారి బయటపడింది.

మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కి వ్యతిరేకంగా తన స్వరం వినిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సొంత మండలమైన మొగల్తూరులో జరిగిన ఈ ఘోరంపై ఎలా స్పందిస్తారో చూడాలి. మెగా ఆక్వాకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఎలాంటి అల్టిమేటం జారీ చేస్తారో చూడాలి.⁠⁠⁠⁠

]]>