తిరుమల చరిత్ర….

తిరుమలలో లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై క్రీ.శ.614. ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ, ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చ్రిత్రలో శాశ్వతంగా నిలిచింది.ఈమెకి ‘పేరుందేవి’అని మరో పేరువుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429, హరిహరరాయలు క్రీ.శ. 1446 లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 లో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్తంభాల మండపాలని నిర్మిచాడు.క్రీ.శ.1473 లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు.

శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు, ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి, మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.

1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9న ఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు.

అచ్యుత రాయలు 1530 లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.

విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాం ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.

తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి వశమైంది. ఈస్టిండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి క్రీ.శ.1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. క్రీ.శ.1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి, దేవునికి క్రమంతప్పక ఉ్సతవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాకా మిగిలిన సొమ్ము ఈస్టిండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది.

కలెక్టర్లపై రెవెన్యూబోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చుచేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా సాలుకు రూ.లక్షకు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దానధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవలసిన స్థితి ఉండేది . క్రైస్తవ మిషనరీలు కంపెనీ ప్రభుత్వం హిందూదేవాలయాలను, ముస్లిముల మసీదులను నిర్వహించడం ప్రోత్సహించడం క్రిందికే వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండులో ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు.

ఐతే తిరుమల, పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు. ఐతే 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. అప్పటి నుంచి 1863 వరకూ దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాథుడులేక, ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతూండడం మూలంగా బ్రిటీష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిజేసే ప్రయత్నం చేసింది.తర్వాత 90 ఏళ్ల పాటు మహంతుల పాలనసాగింది.

]]>