ధర్నాచౌక్ వివాదం లో వామపక్షాలు,స్థానికుల మద్య ఘర్షణ…

ధర్నాచౌక్ ను ఇందిరాపార్కు నుంచి తరలించమంటూ స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ కార్యకర్తలు.తరలించద్దు అంటూ వామపక్షాలు వీరిరువురి మద్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.వివరాలోకి వెళ్తే ధర్నాచౌక్ ను ఇందిరాపార్కు నుంచి తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు.

టీజేఏసీ, వామపక్షాలు, బీజేపీ, కాంగ్రెస్,అఖిలపక్షాల ధర్నాకు జనసేన మద్దతు ఇచ్చింది.జనసేన కార్యకర్తలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.ఇంకా ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాచౌక్ తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. అయితే ధర్నాచౌక్ ను ఇక్కడి నుంచి తరలించాల్సిందేనని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ నేతలు కూడా ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ కార్యకర్తలపై వామపక్షాల కార్యకర్తలు దాడులకు దిగారు. పార్టీల జెండా కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడటంతో స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కుర్చీలు విరిగిపడ్డాయి.

ఇదిలా ఉండగా.. మఫ్టీలో ఉన్న పోలీసులే స్థానికులపై దాడులు చేశారని ప్రొ.కోదండరామ్ ఆరోపించారు. స్థానికులకు తమకు ఎలాంటి విబేధాలు లేవని,ఆయన స్పష్టం చేశారు. ధర్నాచౌక్ తరలింపును సమర్ధిస్తున్న స్థానికులతో తాము చర్చలు జరుపుతున్నామని,వారు కూడా తమకు సంఘీభావం ప్రకటించారని,దాడులు చేసింది మాత్రం పోలీసులేనని ఆయన మండిపడ్డారు.

]]>