మిర్చి యార్డు కేసులో రైతులకు సంకెళ్లు…రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఖమ్మంలో మిర్చి యార్డు కేసులో రైతులకు సంకెళ్లు వేసి తీసుకురావడం పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ చెప్పడం వల్లే రైతులు మిర్చి, పప్పు దినుసులు వేశారని,వారికి ఈ ఏడు మద్దతు ధర లేకుండా పోయిందన్నారు. రైతులను పరామర్శించి, ఆదుకుంటామంటే తమను ప్రభుత్వం అడ్డుకుంటుందని  రాష్ట్రంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేకుండా పోతుందన్నారు రేవంత్. ఖమ్మంలో అరెస్ట్‌ అయిన వారు చిన్నచిన్న రైతులేనని,వారిపై 120బి కేసులు పెట్టారు కాబట్టే, పోలీసులు రైతుల చేతులకు బేడీలు వేశారని అన్నారు.

దీనిపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వెంటనే మంత్రులపై విచారణకు ఆదేశించాలని సూచించారు. సీఎం, సీఎస్, డీజీపీ, మంత్రులు ఢిల్లీలో మకాం వేశారని,క్రాప్ హాలిడే ప్రకటించినట్లు రాష్ట్రంలో పాలనకు కూడా హాలిడే ఇచ్చారని ఎద్దెవా చేశారు. రైతేరాజు అంటున్న కేసీఆర్ రాష్ట్రంలోని రైతులందరికీ  బేడీలు వేస్తారా అంటూ ప్రశ్నించారు.

పాకిస్థాన్‌లో ముషారఫ్‌కు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్‌కు పడుతుందని విమర్శించారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్లీనరీల పేరుతో కోట్ల రూపాయలు వసూళ్లు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో,పప్పులకు క్వింటాకు పదివేల రూపాయలు గిట్టుబాటు ధర ఇప్పిస్తామని చెప్పి మిర్చికి రూ. 8వేలు గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగినా పట్టించుకోలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కేంద్రంపై భారం వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

]]>