‘అదుపు తప్పిన’ కవరేజి .. పాత్రికేయం ప్రమాదానికి గురైందా

మంత్రి నారాయణ కొడుకు నిశిత్ మరణం దురదృష్టకరమే… కానీ అసాధారణ కవరేజీతో భ్రష్ట పాత్రికేయాన్ని ప్రదర్శించిన తీరు మరీ దురదృష్టకరం… ఇదే నిశిత్‌తో పాటు తన ప్రాణస్నేహితుడు కూడా ఇదే స్థితిలో, ఇదే కారులో, ఇదే తీరులో మరణించాడు కదా… మరి ఆ అబ్బాయి గురించి రాయలేదేం..? ఎందుకంటే తను నారాయణ వంటి మంత్రి కొడుకు కాదు కదా… ఆఫ్టరాల్ ఓ పొగాకు వ్యాపారి కొడుకు… అంతేకదా..!!విపరీతమైన స్పీడ్‌తో వెళ్లిన కారు అదుపు తప్పింది… అచ్చంగా ఈ కవరేజీ కూడా అలాగే అదుపు తప్పినట్టు ఉన్నది⁠⁠⁠⁠

నిశిత్ నారాయణ… తెల్లవారుజాము దాకా ఏం చేస్తున్నాడు…? 200 కిలోమీటర్ల వేగంలో కారు నడిపిస్తున్నాడంటే తను ఏ సోయిలో ఉన్నాడు..? గతంలోనూ ఓవర్‌స్పీడ్ జరిమానాలు పడ్డాయా..? ఇలాంటి ప్రశ్నల్ని వదిలేస్తే….. ఎవరు తను..? ఇన్ని కోట్ల మందిలో తన ఏమిటి..? మరణించేవరకు తను ఎవరికీ తెలియనే తెలియదు కదా..,

మొన్నమొన్నటిదాకా చదువుకున్న పిల్లాడే కదా.., జేసీ చెప్పినట్టు సిటీలో పెద్దల పిల్లలకుండే విచ్చలవిడితనమూ ఉంది కదా…, కాకపోతే ఓ మంత్రికి కొడుకు… అదీ వేల కోట్ల విద్యావ్యాపార సామ్రాజ్యానికి వారసుడు… అంతేకదా… తను సొసైటీకి చేసిందేమీ లేదు కదా…, మొన్నమొన్నటిదాకా నారాయణే ఓ విద్యావ్యాపారి… తను, తన కాలేజీ, తన దందా, తన డబ్బు… అదేకదా తనలోకం…? పోనీ.., మృతుడు ఓ స్టార్, ఓ స్పోర్ట్స్‌మన్, ఓ పొలిటిషియన్, ఓ సైంటిస్టు, ఓ సోల్జర్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు కదా… కేవలం ఒక ఏపీ మంత్రికి కొడుకు… కానీ తెలుగు ప్రధానపత్రికలు ఆ ప్రమాదానికి ఇచ్చిన ప్రాధాన్యత నివ్వెరపరుస్తున్నది… పాత్రికేయంలో అరాచకం ఇది.., ఎందుకిలా..?

నిజమే… నిశిత్ ప్రమాదంలో చనిపోవడం బాధాకరమే…సానుభూతి ఉంది… అలాగే ఈ ప్రమాదానికి మితిమీరిన పబ్లిసిటీ ఇచ్చి, ఓ ధ్రువతార నేలకొరిగింది అనే స్థాయి కవరేజీ ఇవ్వడం కూడా అంతే తప్పు… గతంలోనూ ఇలా పెద్దల పిల్లలు అర్ధరాత్రిళ్లు వాహనాల్లో సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలూ ఉన్నాయి…తప్పుకుండా ప్రముఖంగా ఇది అచ్చేయాల్సిన వార్తే… రెండున్నర కోట్ల కారు, 200 కిలోమీటర్ల స్పీడ్, వేల కోట్ల వారసుడు, ఎయిర్‌బ్యాగ్ కూడా తెరుచుకోకుండా మరణించడం… తప్పకుండా వార్తే… కానీ… ఫస్ట్ పేజీలో అరపేజీ స్పేస్ ఇవ్వడం అసాధారణం…

నిశిత్ ఎక్కడి నుంచి బయల్దేరాడు, ఏ రూట్‌లో వెళ్లాడు, ఎక్కడ పిల్లర్‌ను గుద్దాడు అనే గ్రాఫిక్ కూడా… పైగా రెండు పేజీలను పూర్తిగా ప్రత్యేకంగా ఈ వార్తలకే కేటాయించింది… ప్రమాదసమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర్నుంచి, డాక్టర్ల అభిప్రాయాల దగ్గర్నుంచి, గతంలో జరిగిన దుర్ఘటనల దగ్గర్నుంచి, సదరు వాహనం స్పెషాలిటీ వరకు ఎన్నో వార్తల్ని కుమ్మేసింది… అసాధారణ కవరేజీ..

మన జాతిని ఉద్ధరించే మహానాయకులు ఉన్నారు కదా… ఓ బస్సు నిలువునా దగ్ధమై, ప్రయాణికులు తగలబడిపోతే ఒక్కడూ వెళ్లడు… కుట్రపూరితంగా ఓ లారీ రోడ్డు పక్కన నిలుచుకున్న వారిపైకి దూసుకుపోతే ఒక్కడూ వెళ్లడు…వివాదాస్పదమైన ఓ ఆక్వా యూనిట్‌లో విషవాయువులతో కార్మికులు మరణిస్తే ఒక్కడూ వెళ్లడు… “నమ్ముకున్న పంటపైనే ఉసురుపోయిన ఓ పసుపు రైతు దగ్గరకు ఒక్కడూ వెళ్లడు”…

ఆత్మహత్యలు చేసుకునే రైతు కుటుంబాల దగ్గరకు ఒక్కడూ వెళ్లడు నిజంగా తాము స్పందించాల్సిన ఘోరాలపై, దారుణాలపై కదలిక ఉండదు…నిశిత్ ప్రమాదస్థలికి హుటాహుటిన చేరి, కంటతడి పెట్టుకుంటారు… అయ్యలూ, బాబులూ, దొరలూ, ప్రభువులూ… ఇదే “నారాయణ”కు సంబంధించిన కాలేజీల్లో అనేక అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు ఎన్నో… ఆ తల్లిదండ్రులవీ కన్నీళ్లే సార్లూ… మంత్రి నారాయణ కన్నీటికి ఎంత గాఢత ఉందో, ఆ కాలేజీలో ఉరిపోసుకున్న ఓ విద్యార్థి తండ్రి కన్నీటికీ అంతే గాఢత ఉంటుంది…

కానీ అవి వార్తలు కావు, వార్తలుగా రావు, ఒకవేళ రాయాల్సి వస్తే, ఎక్కడో కనిపించకుండా చిన్న వార్త… అందులోనూ కాలేజీ పేరు ఉండదు… సో, విలువైన కన్నీళ్లు, విలువే లేని కన్నీళ్లు అనే వర్గీకరణ అన్నమాట… సేమ్, ఆ నాయకుల్లాగే ఈ ఒక్కో పార్టీ రంగు పత్రికలు… ఇలాంటివాళ్లు రోజూ జాతికి నీతులు, ప్రమాణాలను బోధిస్తుంటారు…!

తను మంత్రి కొడుకు కాకపోయి ఉంటే, అదీ నారాయణ కొడుకు కాకపోయి ఉంటే… ఈ ప్రమాదం వార్త ఎక్కడో ఏ సిటీ టాబ్లాయిడ్ క్రైం పేజీలో వేసేవారేమో… నిజానికి ఈమధ్యకాలంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతరత్రా సెలబ్రిటీలు గట్రా మరణించినప్పుడు కూడా ఇంత కవరేజీ చూడలేదు… ఇక నేతల దిక్కుమాలిన వ్యాఖ్యలు, స్పందనలు చూడండి… జేసీ వచ్చి పిల్లలపై మనకు అదుపు ఉండాలి, అడిగినవన్నీ ఇస్తే ఎలా అంటూ నీతులు చెప్పాడు…

తన తమ్ముడి కొడుక్కి మూడున్నర కోట్ల కారు మొన్నమొన్ననే కొని, పండగ జేసుకున్న తీరు మరిచిపోయి ఉంటాడు… మరో గ్రేట్ ఎమ్మెల్యే… అర్ధరాత్రి దాటాక వేగంగా వచ్చే కార్లపై కాస్త అదుపు కోసం, ప్రతి సెంటర్‌లో పోలీసు వాహనాలు బుగ్గలు వెలిగించి మరీ నిలపాలట… అలాగైతే పోలీసులు ఉన్నారు అని ఆ స్పీడ్ కార్లు కంట్రోల్‌లో ఉంటాయట… ఆహా.., పబ్బుల్లో తాగి, తాగి, ఊగుతూ కార్లు నడిపేవాళ్ల కోసమా పోలీసు వ్యవస్థ..?

 ]]>