రాజశేఖర్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 28న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకం పై ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది . ఈ సినిమా గురించి రాజశేఖర్ మాటల్లో …
మీ సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకొంటున్నారు ?
నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, నా మేనరిజమ్స్ బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్… అన్ని బాగున్నాయి.
మీ సినిమాలలో మీ క్యారెక్టర్ డామినేటింగ్ గా ఉంటుంది కదా ..మరి ఈ సినిమాలో ?
సినిమాలో నా క్యారెక్టర్ ఎలాంటిది అనేది అనే కంటే ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, పోరాటాలు బాగున్నాయని అందరూ చెబుతున్నారు. అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం?
నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా.
‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరించినప్పుడు మీరు ఏమన్నారు ?
సినిమాలో రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. ‘ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే’ అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్ కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. ‘ఇది మీ డైలాగే కదా!’ అంది. ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాలకృష్ణ తో కలిసి సినిమా ఎప్పుడు ?
ఈ పుకార్లు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. (నవ్వులు)
‘దొరసాని’గా శివాత్మిక ఇంట్రడ్యూస్ అవుతున్నారు. మీ ఇద్దరు కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా ?
ఉంది. అయితే… ఇప్పుడు కాదు. పెద్దమ్మాయి శివాని కూడా కథానాయికగా పరిచయమైన తర్వాత చేస్తాం. నిజానికి, ‘దొరసాని’ కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్ కి చెప్తే నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది.
మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా ?
ప్రవీణ్ సత్తారు గారు ‘గరుడవేగ 2’ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.