ఉస్మానియా "శతమానం భవతి"-సౌకర్యాలు కల్పిస్తే మరో శతకం

దేశానికి ప్రధానిని,కేంద్రమంత్రులను, ఎంపీలను, రాష్ట్రానికి ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను.. అంతకుమించి అత్యున్నతమైన విద్యావంతులను అందించిన ఘనత వహించినఉస్మానియా యూనివర్సిటీ నేడు ఘనంగా వందేళ్ల ఉత్సవాలు జరుపుకోడానికి సిద్ధమైందిఇంకా కొన్ని సమస్యలు ఇక్కడ తారాడుతున్నాయి.. శతవసంతాల ఉత్సవ వేళ ఈ విద్యావనం విజయాలతోపాటు లేమి  ని కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది .

బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభిస్తారు. బుధవారం నుంచి శుక్రవారం దాకా అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు వర్సిటీ వీసీ రామచంద్రం ప్రణాళిక రూపొందించారు. పూర్వ విద్యార్థులు, పలువురు ప్రముఖుల సమక్షంలో మూడు రోజులపాటు సదస్సులు, గోష్ఠులు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టి.. ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించాలని భావిస్తున్నారు. వందేళ్లలో ఎన్నో విజయాలు నమోదు చేసిన ఈ వర్సిటీకి సరైన తోడ్పాటు అందిస్తేనే మున్ముందు తన ప్రత్యేకతను కొనసాగించే వీలుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు

1917లో 75 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ వర్సిటీ క్యాంపస్‌లో ప్రస్తుతం 9,060 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. అనుబంధ కళాశాలలు, ప్రైవేటు కళాశాలలతో కలిపి 3,90,740 మంది విద్యార్థులు చదువుతున్నారు.

* ఎనిమిది క్యాంపస్‌ కళాశాలలు, ఐదు అనుబంధ కళాశాలలు, ఐదు జిల్లాల పీజీ సెంటర్‌ కళాశాలలతోపాటు 721 ప్రైవేటు కళాశాలలున్నాయి. క్యాంపస్‌లో మొత్తం 12 ఫ్యాకల్టీలు, 53 విభాగాలు, 54 పీహెచ్‌డీ అధించే విభాగాలు, 25 యూజీ కోర్సులు, 75 పీజీ కోర్సులు, 50 డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

2009-16 మధ్యకాలంలో 194 వ్యక్తిగత పరిశోధన ప్రాజెక్టులను ఓయూ అధ్యాపకులు సాధించారు. వాటి విలువ దాదాపు రూ.42 కోట్లు. ఓయూ నుంచి ఈ కాలంలో 5225 పరిశోధన గ్రంథాలను ప్రచురించారు. 139 సెమినార్లు, 65 సమావేశాలు, 40 కార్యశాలలు, 19 సింపోజియంలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించారు. రూ.2.24 కోట్ల విలువైన ఆరు కన్సల్టెన్సీ ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఈ మధ్యకాలంలో 2218 మంది విద్యార్థులు పరిశోధన పూర్తి చేసి పీహెచ్‌డీ పట్టాలను పొందారు.

* 2009-16 మధ్యలో ఓయూ పరిధిలోని 2,682 మంది విద్యార్థులు నెట్‌, సెట్‌, గేట్‌, సీఎస్‌ఐఆర్‌ వంటి పరీక్షలలో అర్హత సాధించారు. ప్రస్తుతం వర్సిటీ 23వ ర్యాంకులో ఉంది. వర్సిటీ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి ఏటా దాదాపు 520 మంది విద్యార్థులు బయటకు వస్తుండగా దాదాపు అందరికీ ఉద్యోగాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో గ్రూపు 1, 2 పోస్టుల భర్తీ జరిగితే అందులో ఎంపిక అవుతున్న వారిలో 20 శాతానికిపైగా ఓయూలో చదువుకున్న వారే. అనేక మంది అఖిల భారత సర్వీసులకూ ఎన్నికవుతున్నారు.

ప్రభుత్వం 1264 ఆచార్య పోస్టులు మంజూరు చేసినా..ప్రస్తుతం 532 మంది మాత్రమే ఉన్నారు.దాదాపు సగానికిపైగా ఖాళీలు ఉన్నాయి. ప్రతి విభాగంలో తప్పనిసరిగా కనీసం ఒక్క ప్రొఫెసర్‌ అయినా ఉండాలి. కానీ ఒక్కరూ లేని దుస్థితి. గత 10-12 ఏళ్లుగా పదవీ విరమణలు పెరిగాయి అందుకు తగ్గట్టుగా నియామకాలు జరగడం లేదు.ఏ అభివృద్ధి పని చేపట్టాలనుకున్నా నిధుల కోసం దీనంగా చూసే పరిస్థితి లేకుండా ఉండాలి… ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తీసుకునేలా ఉండరాదు.శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆచార్యులు కోరుకునేది ఇవే. ఈ మూడు సమస్యలు లేకుంటేనే ఓయూకు పూర్వ వైభవం సాధ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. ఓయూ గ్రంథాలయంలో మొత్తం 5,43,759 పుస్తకాలున్నాయి. ఒకేసారి 1500 మంది చదువుకునే అవకాశముంది. దీన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ గ్రంథాలయాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓయూలో దాదాపు 20కి పైగా పరిశోధన కేంద్రలున్నాయి. లైఫ్‌సైన్స్‌ విభాగంలో చాలా విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి.మారుతున్నపరిస్థితులకు అనుగుణంగా అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టొచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. శతాబ్ది ఉత్సవాలను జరుపుకున్న విశ్వవిద్యాలయాలు దేశంలో ఆరున్నాయి. అవి బెనారస్‌, అలీఘఢ్‌, కలకత్తా, మద్రాస్‌, మైసూరు, బొంబాయి విశ్వవిద్యాలయాలు.ఇటీవల కేంద్రం ర్యాంకులను ప్రకటిస్తే బెనారస్‌, అలీఘడ్‌, కోల్‌కత్తా వరుసగా 3, 11, 16 స్థానాలతో ఓయూ కంటే ముందున్నాయి. ఓయూ 23వ ర్యాంకు నిలుపుకోవాలన్నా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అవసరం 
 
 ]]>