పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఎల్) నిర్మించిన వార్ధా(మహారాష్ట్ర)–డిచ్పల్లి(నిజామాబాద్) 765 డీసీ విద్యుత్ కారిడార్ ద్వారా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రాష్ట్రానికి ఈ విద్యుత్ సరఫరా అవుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను బట్టి వార్ధా–డిచ్పల్లి గ్రిడ్ నుంచి 650 మెగావాట్ల నుంచి 700 మెగావాట్లను తెలంగాణ ట్రాన్స్‌కో డ్రా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు కరెంట్ సరఫరా ఉండడంతో ఎన్టీపీసీ కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ తీసుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన వార్ధా–డిచ్పల్లి లైన్ల చార్జింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతమరో రెండు మూడ్రోజుల్లో అధికారిక సరఫరా ప్రారంభమవుతుందని తెలంగాణ ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్డీసీ) నుంచి ఇందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు–విపక్షాలు, విద్యుత్ రంగ నిపుణుల నడుమ గత రెండున్నరేళ్లుగా ఎన్నో వాదోపవాదాలు, ఆరోపణలు, విమర్శలకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కేరాఫ్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విద్యుత్ సరఫరా ప్రారంభమైనా ధరపై ఇంత వరకు కచ్చితత్వం లేదు. తుది ధరను ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ప్రకటించిన తర్వాతే విద్యుత్ కొనుగోళ్ల ద్వారా తెలంగాణకి లాభమో నష్టమో అన్న అంశాలపై స్పష్టత రానుంది. ఛత్తీస్‌గఢ్‌లో 2017–18లో అమలు చేయాల్సిన విద్యుత్ టారీఫ్ ఉత్తర్వులను తాజాగా ఆ రాష్ట్ర ఈఆర్సీ జారీ చేసింది. మార్వా థర్మల్ ప్లాంట్ విద్యుత్‌కు సంబంధించి తాత్కాలిక ధరను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. వార్షిక స్థిర చార్జీలు రూ.1871.72 కోట్లు, పీ అండ్ జీ కాంట్రిబ్యూషన్ రూ.19.13 కోట్లు, చర వ్యయం యూనిట్‌కు రూ.1.20గా అమలు చేయాలని సూచించింది.
ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ(సీఎస్‌పీజీసీఎల్) నిర్మించిన 1000 మెగావాట్ల మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకుంది. టెండర్లకు బదులు పరస్పర అంగీకార ఒప్పందం(ఎంఓయూ) ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్రం ఏటా రూ.1000 కోట్ల భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అభ్యంతరాలపై ఏడాది కింద బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ… ఈ పీపీఏపై ఇంత వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా ప్రారంభమైన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ పీపీఏపై సత్వర నిర్ణయం తీసుకోవాలంటూ ట్రాన్స్‌కో శనివారం టీఎస్ఈఆర్సీకి లేఖ రాసింది.
]]>