సాయి బోధనలు….
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్రదాయాలను కూడా పాటించారు. నమాజ్ చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు.తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం – వీటిని ప్రోత్సహించారు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు.నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పారు. తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పారు – అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు.అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించారు.
రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది.హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి.తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నార.
భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పారు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు.
సాయిబాబా రచించిన గ్రంథాలేవీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవారు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని అనుయాయులు అనేవారు.
దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవారు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాసం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు.
బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?అతనికి మొదలు లేదు… తుది లేదు.తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:
- షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
- మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
- నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
- నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
- నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
- నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
- నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
- మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
- మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
- నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
- నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.