లోక్ నీతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సిమ్ కార్డ్స్ వెరిఫై చేసిన తర్వాతే జారి చేయాలనీ ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది.దేశవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల మొబైల్ వినియోగదారులందరి వివరాలూ ఏడాదిలోగా వెరిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. కొత్తగా సిమ్‌లు తీసుకొనే వారందరికీ ఆధార్ నంబరు ద్వారా ఈ-వెరిఫై చేశాకే కనెక్షన్ ఇచ్చే విధంగా నూతన వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించింది.
సిమ్ కార్డుల గుట్టు ..
ఈ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఇదే సూచన చేసింది. దేశంలోని మోబైల్ వినియోగదారులందర్నీ గుర్తించేలా సమర్థవంతమైన వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పింది. ప్రస్తుతం మొబైల్ వినియోగిస్తున్న వంద కోట్ల మందితో పాటు భవిష్యత్తు వినియోగదారుల గుర్తింపు వివరాలను కూడా తెలుసుకునేందుకు ఏడాదిలోగా సమర్థ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని నిర్దేశించింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.
మొబైల్ యూజర్ల గుర్తింపును పరిశీలించే వ్యవస్థను త్వరలో ప్రవేశ పెట్టనున్నామని, కొత్త వినియోగదారులు ఇకపై సిమ్ తీసుకునే ముందు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. పిటిషన్లో కోరిన వినతులు చాలా వరకూ పరిష్కారమయ్యాయని, కేంద్రం జవాబుపై సంతృప్తి చెందామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా, మొత్తం వినియోగదారుల్లో ప్రీపెయిడ్ వినియోగదారులు 90 శాతం ఉంటారని, వాళ్లు రీచార్జి చేయించుకోవడానికి వస్తుంటారని, ఒక ఆర్నెల్ల గడువు ఇచ్చి, ఆలోగా వెరిఫికేషన్ చేయించుకోకుంటే రీచార్జి నిలిపేయాలని బెంచ్ సూచించింది. సుప్రీం సూచనను అమలు చేయడం సాధ్యం కాదని అటార్నీ జనరల్ చెప్పారు. బ్యాంకింగ్ అవసరాలకు కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నందున వెరిఫికేషన్ ప్రాధాన్యం సంతరించుకుందని పిటిషనర్ వాదించారు. బోగస్ మొబైల్ కనెక్షన్ల వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. వంద శాతం కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరారు.
]]>