లక్షలు లంచాలు తీసుకునే వాళ్ళకు ఏమి కాదు.25 పైసలు ఓ కండక్టర్ ఉద్యోగాన్ని పోగొట్టింది.చిన్న పొరపాటు 23 సంవత్సరాలు ఉద్యోగానికి దూరం చేసింది.25 పైసల జమానా ఇప్పటిది కాదు కదా అనుకుంటున్నారా?ఈ సంఘటన కూడా ఇప్పటిది కాదు.23 ఏళ్ల నాడు జరిగింది.విశేషం ఏంటంటే ఆ ఉద్యోగం ఇప్పుడు మళ్లీ వచ్చింది.న్యాయం కోసం ఆ కండక్టర్ చేసిన పోరాటం వల్ల ఫలితం లభించింది.హైకోర్టు తీర్పుతో మరల అతన్ని ఉద్యోగంలోకి తీసుకుంటోంది ఆర్టీసీ.
ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే….1993 అక్టోబర్ 27.. చార్మినార్ నుంచి ఫతేదర్వాజ వెళుతోంది బస్సు. కండక్టర్ ఎం.ఎల్.అలీ ప్రయాణీకుల దగ్గర టిక్కెట్లు తీసుకుంటున్నాడు.అప్పుడే బస్సును తనిఖి చేసిన ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు.. ఆ సమయంలో ఓ ప్రయాణికుడి నుంచి 50 పైసలు వసూలు చేసి టికెట్ ఇవ్వలేదని, ఓ ఇద్దరు మహిళలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా పట్టించుకోలేదంటూ అలీపై అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. విచారణ జరిపిన అధికారులు అలీని ఉద్యోగం నుంచి తొలగిస్తూ 1994 మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అప్పీలెట్ అథారిటీ, ఆ తర్వాత రివ్యూ అథారిటీ కూడా సమర్థించాయి.
ఈ తీర్పుపై 1997లో ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు అలీ. ట్రిబ్యునల్ ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. 75 పైసల టికెట్ కోసం ప్రయాణికుడు 50 పైసలు ఇచ్చి సరిపెట్టడంతో, మిగిలిన 25 పైసల కోసం డిమాండ్ చేస్తూ తాను టికెట్ ఇవ్వలేదని, ఈ మధ్యలోనే స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేసిందన్న కండక్టర్ వాదనను అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇద్దరు మహిళల వద్దకు వచ్చి టికెట్ ఇచ్చేలోపే స్క్వాడ్ వచ్చారని.. ఇక తాను చేసేది ఏముంటుందని ట్రిబ్యునల్ ముందు వాపోయాడు అలీ.
పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ట్రిబ్యునల్ అలీకి అనుకూలంగా ఉత్తర్వు లిచ్చింది. వీటిపై ఆర్టీసీ యాజమాన్యం 1999లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ట్రిబ్యునల్ ఉత్తర్వులను సమర్థిస్తూ అలీని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి తీర్పుపై ఆర్టీసీ యాజమాన్యం 2009లో ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
]]>