నారాయణ కుటుంబానికి సానుభూతి తెలిపిన మెగా బ్రదర్స్

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్‌ మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.“ఎంతో భవిష్యత్‌ ఉన్న నిషిత్‌, అతడి స్నేహితుడు రాజా రవి వర్మ దుర్మరణం చెందడం దురదృష్టకరం. ఎదిగిన కుమారుడు కళ్లెదుటే కనుమరుగయ్యే పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు.మనం సాంకేతికంగా ఎదుగుతున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వారి మృతదేహాలను చూశాను, వారి కుటుంబసభ్యుల కన్నీరు నాకు తీవ్ర మనోవేదనను కలిగించింది. రోడ్డు ప్రమాదాలు లేని ప్రజా జీవనం కోసం మనమంతా నిబద్ధతతో కృషి చేయాలి. నిషిత్‌, రవివర్మల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విపత్తును తట్టుకునే స్థైర్యాన్ని శ్రీ నారాయణకు, రవివర్మ తండ్రి శ్రీ కృష్ణకు ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నిషిత్‌, రవివర్మల కుటుంబాలకు నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నానని” అన్నారు పవన్.

నిషిత్‌ చనిపోవడం బాధాకరమని, శత్రువుకు కూడా ఇలాంటి కష్టం రాకూడదని అన్నారు మాజీ కేంద్రమంత్రి,సినీ నటుడు చిరంజీవి.అపోలో ఆస్పత్రి లో నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఎదిగొచ్చిన కుమారుడు చనిపోతే ఆ బాధ చాలా ఉంటుందని, ఈ విషాదం నుండి నారాయణ త్వరగా కోలుకోవాలని, చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నానని అన్నారు.  ]]>