"ఉగాది పచ్చడి"తయారి ఇలా…

చైత్ర శుద్ధ పాడ్యమి,ఉగాది రోజు ప్రత్యేకంగా తయారు  చేసే ఉగాది పచ్చడి తయారి విధానం…

“ఉగాది పచ్చడి” ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం.తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు.సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

“త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవని బామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు”

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.

ugadi

*ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి.

*ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు.

*వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది.

*సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు.

*ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి.

*ఉగాది పచ్చడిని సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి.

*కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది.

*పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు.

*ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు.

*ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.

]]>