విద్యాసాగర్ రావు తుది శ్వాస విడిచారు….

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, సాగునీటి విషయంలో రాష్ట్రం ఆవశ్యకత గురించి ప్రచారం చేసిన,ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు కన్నుమూశారు.క్యాన్సర్‌ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఉదయం 11.23 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.రెండేళ్లుగా కేన్సర్‌తో బాధ పడుతున్నారు.ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.అయిన మెరుగు పడక పోవడం తో గత కొంత కాలంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పరిస్థితి విషమంగానే ఉండటంతో కొన్నాళ్లుగా వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆయన అత్యంత సన్నిహితులు.ఇటీవలే ఆయనను కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ‘విద్యన్నా.. నేను కేసీఆర్‌ను’ అంటూ పలకరించారు.సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌(సీడబ్ల్యూసీ)లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించి రిటైరైన విద్యాసాగర్‌ రావు.తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయనను కేసీఆర్‌ సర్కారు సాగునీటి ముఖ్య సలహాదారుగా నియమించింది.

విద్యాసాగర్ రావు సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం. ప్రస్తుతం ఈ ఊరు యాదాద్రి జిల్లాలోకి వెళ్లింది. 1939 నవంబర్ 14న జన్మించారు. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు విద్యాసాగర్ రావు. 1979లో రూర్కీ యూనివర్సిటీ నుంచి వాటర్ రీసోర్స్ డవలప్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. 1983న USAలో ఉన్న కొలరాడో యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్స్ సిస్టమ్స్ పై డిప్లొమా చేశారు. 1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు.

సెంట్రల్ వాటర్ కిషన్ లో ఇంజినీర్ గా కెరీర్ ప్రారంభించిన విద్యాసాగర్ రావు.. వివిధ రాష్ట్రాల్లో పని చేశారు. చీఫ్ ఇంజినీర్ స్థాయిలో రిటైర్ అయ్యారు. మనదేశం తరఫున ప్రపంచ దేశాల్లో పర్యటించి, అక్కడి నీటిపారుదల రంగంపై అధ్యయనం చేశారు. వాటిని ఇక్కడి అమలు చేసి.. బీడు భూములకు నీళ్లు పారించారు. మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నారు. ఇండియన్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు, ఇరిగేషన్ మేనేజ్ మెంట్ బోర్డుల్లో జీవితకాల సభ్యునిగా ఉన్నారు.

]]>