S 3 ( యముడు) రివ్యూ..

SINGAM

ఎస్‌3(యముడు-3) : సమీక్ష

చిత్రం : ఎస్‌3(యముడు3)

రేటింగ్‌ : 2.5/5
నటీనటులు : సూర్య, అనుష్క, శ్రుతిహాసన్‌, రాధిక, సుమన్‌, క్రిష్‌, సూరి, నీతూచంద్ర తదితరులు
ఛాయాగ్రహణం : ప్రియన్‌
కూర్పు : విటి విజయన్‌, టీఎస్‌ జయ్‌
సంగీతం : హారీస్‌ జయరాజ్‌
నిర్మాత : మల్కాపురం శివకుమార్‌
రచన, దర్శకత్వం : హరి
యముడు సినిమా గుర్తుకొచ్చినవారు తెలివైన యాంగ్రీ పోలీస్‌మాన్‌ అనుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎంత సులువుగా పరిష్కరిస్తారో చూశాం.. ఆ టెంపోతోనే రెండోపార్టుగా సింగం వచ్చింది.. అది కూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.. తాజాగా మూడో పార్ట్‌గా ఎస్‌3 బాక్స్‌లో తన సత్తా చాటేందుకు ముందుకొచ్చింది.. మరి సింగం వేట ఈ సారి ఎలా సాగింది.. ఏ అంశాన్ని చేధించింది.. దానికి వేదికగా ఏ అంశం నిలిచింది.. టోటల్‌గా గత సినిమాలను మరిపించిందా అనేది సమీక్షిద్దాం…
కథ…
ఏపీలో ఎన్టీయార్‌ సీఎంగా, తమిళనాడులో ఎంజీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఒక కేడర్‌ అధికారులను మరో చోట పని చేసే అవకాశం కల్పించిన యదార్థ ఘటనను స్ఫూర్తిగా దర్శకుడు హరి కథ సిద్ధం చేసింది తెలిసిందే.. ఆ క్రమంలోనే ఏపీ కేడర్‌ పోలీసు అధికారిని ప్రత్యేక అనుమతితో కర్ణాటకలో హత్యకు గురైన కమిషనర్‌ కేసుని చేధించేందుకు నరసింహం(సూర్య) రంగంలోకి దిగుతాడు.. ఎప్పటిలానే తన వ్యూహాలతో కేసును ముందుకు తీసుకెళుతున్న తరుణంలో కనిపించిన కొత్తకోణాలేంటి.. ఎదురైన ఇబ్బందులేంటి.. వాటిని తట్టుకుని నిలబడేందుకు ఆస్ట్రేలియా వరకు ఎందుకెళ్లాడు అనేది కథ…
విశ్లేషణ..
యముడు, సింగం లాంటి సినిమాల కొనసాగింపుగా మరో సినిమాని తీసుకొచ్చి ప్రేక్షకులను మెప్పించాలనకోవడం సాహసమనే చెప్పాలి.. ఆ క్రమంలోనే దర్శకుడు కథని పక్కాగా సిద్ధం చేసుకున్నా.. అంతుకు ముందు రెండు స్టోరీల్లో ఉన్న మలుపులు, ఉత్కంఠని దీనిలో కొనసాగించడంలో కొంత మేర ఆసక్తిని రేకెత్తించలేకపోయాడు.. యముడు సినిమాలో ఉన్న వేగం సింగంలో కనిపించదు.. కాని ఎస్‌3 కొచ్చేసరికి తొలి సినిమా తరహాలో ఎక్కడా కథనం స్పీడ్‌ తగ్గదు.. అది కొంత మేర కలిసొచ్చిందనే చెప్పాలి.. అనుష్కతో తన రిలేషన్‌ని అలాగే కొనసాగిస్తూ శ్రుతిహాసన్‌ని కూడా మరో కథానాయికగా చూపించడం బానే ఉంటుంది.. అయినా శ్రుతికి సూర్యకి మధ్య కెమెస్ట్రీ పెద్దగా వర్క్‌అవుట్‌ కాలేదు.. నటనలో సూర్యకి వంద మార్కులు పడతాయి.. సినిమా ఆసాంతం ఉర్రూతలూగించే.. హీరోయిజం ఎక్కడా తగ్గకుండా కథ సాగిపోతుంది. సీక్వెల్‌లో దేవిశ్రీని తప్పించి మూల్యం చెల్లించుకున్నట్లు అనిపిస్తుంది. హారిష్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బావున్నా పాటలు తెరపై తేలిపోయాయి.. కెమెరా పనితనం బావుంది.. కథాపరంగా చాలా బిగువుగా కథనం సాగుతుంది..
ప్లస్‌పాయింట్స్‌
+ సూర్య నటన.. యాక్షన్‌ ఎపిసోడ్‌లో పూర్తిస్థాయిలో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాడు
+ రాధికతో ఎమోషనల్‌ డైలాగ్స్‌
+ బలమైన విలన్‌.. తనతో హీరో ఢీకొట్టే విధానం..
+ ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు సీన్‌..
+ ప్రధమార్ధం ముగింపు, పతాక సన్నివేశాలు
మైనస్‌ పాయింట్స్‌
– హాలీవుడ్‌కి కూడా అందని రీతిలో క్షణాల్లో మొబైల్స్‌ పొజిషన్‌ తెలుసుకోవడం.. ఒక నంబరు తెలిస్తే దాని పక్కన ఏ నంబరు ఉందో కనిపెట్టడం.. వైఫై ఫాస్‌వర్డ్‌ ఆధారంగా మొత్తం సర్వర్‌లోని డేటాని సొంతం చేసుకోవడం వంటివి విచిత్రంగా అనిపిస్తుంది.
– బలమైన విలన్‌ ఉన్నా.. తాను చేసేది తప్పు అనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలిగించలేకపోవడం
– శ్రుతి హాసన్‌ లవ్‌ ట్రాక్‌
– కథకు సంబంధంలేని కామెడీ యముడిలో కుదిరినా ఇక్కడ బెడిసి కొడుతుంది.. ఆయా సీన్లు చూసి బోర్‌ అనిపిస్తుంది
– మొదటి రెండు సినిమాల్లో సూర్యతో కలసి కొందరు నిజాయతీగల పోలీసు ఆఫీసర్లు ఉన్నట్టు చూపినా.. ఈసారి మొత్తం క్రెడిట్‌ హీరోకే ఇస్తూ సాగడం
– పాటలు.. సినిమా మధ్యలో వచ్చే పాటలు చూసి ప్రేక్షకులు లేచి బయటకు వెళిపోయే పరిస్థితి
ఫలితం
మాస్‌ సినిమాలపై ఆసక్తి ఉన్న వర్గానికి తప్పకుండా నచ్చుతుంది.. యాక్షన్‌ సన్నివేశాలు వారిని ఆకట్టుకుంటుంది.. మొదటి రెండు చిత్రాలు చూసినవారిలో ఎక్కువ మంది ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందరనే చెప్పాలి.. సినిమా మొత్తాన్ని సూర్య పర్ఫామెన్స్‌తోనే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.. కలక్షన్ల పరంగా నమోవెంకటేశాయ కన్నా ఒక రోజు ముందు రావడంతో వీలైనన్ని ఎక్కువ థియేటర్లు సొంతం చేసుకోవడం.. కలిసొస్తుంది..

శ్రీ⁠⁠⁠⁠